మీకు టీ-హబ్ తెలుసు కదా? హైదరాబాద్ లోని రాయ్ దుర్గ్ లో ఉంటుంది..! స్టార్టప్ కంపెనీలకు అది అడ్డా..! వాటికి గైడెన్స్, మెంటార్ షిప్ ఇచ్చేందుకు.. ఫండింగ్ కు దారి చూపేందుకు టీ-హబ్ ఉపయోగపడుతుంది..! అలాంటిదే ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలోనూ రెడీ అవుతోంది..! దాని పేరే కె-హబ్..! మరి దీని విశేషాలేంటి? ఇందులో ఎలాంటి సదుపాయాలు కల్పిస్తారు? కె-హబ్ వల్ల ఎవరికి ఎక్కువగా ఉపయోగముంటుంది? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.
కన్వల్ రేఖి రూరల్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ అండ్ స్టార్టప్ సెంటర్..! షార్ట్ కట్ లో క్రెస్ట్..! దీన్నే కె-హబ్ అని కూడా పిలుస్తారు..! రూరల్ యూత్ కోసం దీన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. వారి ఆలోచనలకు ఆవిష్కరణల రూపమిచ్చేందుకు.. స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహాన్ని అందించేందుకు కె-హబ్దో హదపడుతుంది. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలో ఇది నిర్మితమవుతోంది.
- గ్రామీణ ప్రాంతంలో తొలి ఇన్నోవేషన్ హబ్:
గ్రామీణ యువత కోసం రూరల్ ఏరియాలో ఇలాంటి ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు కావడం దేశంలోనే ఇదే తొలిసారి కావడం విశేషం..! తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇన్నోవేషన్, ఆంత్రప్రెన్యూర్ షిప్ కు చేయూత ఇవ్వాలన్న ఉద్దేశంతో 12 ఏళ్ల క్రితం కాకతీయ శాండ్ బాక్స్ ను ఏర్పాటు చేసిన ఫణీంద్ర, రాజు రెడ్డి చొరవతో కె-హబ్ కార్యరూపం దాలుస్తోంది. దీనికి ప్రముఖ ఇండో అమెరికన్ ఇండస్ట్రియలిస్ట్ కన్వల్ సింగ్ రేఖి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నారు. కె-హబ్ కోసం ఆయన 20 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించారు.
- ఎకో ఫ్రెండ్లీ బిల్డింగ్:
కె-హబ్ కోసం 5 ఎకరాలు కేటాయించారు. 7 వేల చదరపు అడుగుల్లో భవన నిర్మాణం జరుగుతోంది. పూర్తి ఎకో ఫ్రెండ్లీగా దీన్ని కన్ స్ట్రక్ట్ చేస్తున్నారు. అగ్రికల్చర్, స్కిల్ డెవలప్ మెంట్, ఇండస్ట్రీ రంగాల స్టార్టప్ లకు కె-హబ్ అండగా నిలవనుంది. ఈ ఏడాది చివరినాటికి ఇది పూర్తిగా అందుబాటులోకి రానుంది.
టీ-హబ్ తరహాలోనే కె-హబ్ తో కూడా యువతకు ఎన్నో లాభాలుండబోతున్నాయి..! వారికి కావాల్సిన దిశా నిర్దేశం ఇక్కడ దొరుకుతుంది. ఇండస్ట్రీ ఎక్స్ పర్ట్స్ సలహాలు, మెంటార్ల సూచనలు పొందే వీలు కలుగుతుంది. అలాగే స్టార్టప్ లకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ దొరికే చాన్స్ ఉంది. మొత్తమ్మీద రూరల్ యూత్.. పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు కె-హబ్ దిక్సూచిలా మారబోతుందన్న మాట..!
- పి. వంశీకృష్ణ