వ్యాపారంలో రాణించాలంటే కఠోర శ్రమ కావాలి. ఎంచుకున్న రంగంలో ఎదగాలనే దృఢ సంకల్పం ఉండాలి. అలాగే బిజినెస్ ఒక స్థాయికి చేరి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంటే.. సమాజం నుంచి గౌరవం లభిస్తుంటే అప్పుడేం చేయాలి? మనకు ఇలాంటి అవకాశాన్నిచ్చిన సమజానికి తిరిగి ఎంతో కొంత మంచి చేయాలి కదా? అదే చరిత్రలో మన పేరును చిరస్థాయిగా నిలబెడుతుంది. రాబోయే తరాలు కూడా గుర్తుంచుకునేలా చేస్తుంది. సరిగ్గా ఇదే కోవకు చెందుతారు ప్రముఖ వ్యాపారవేత్త, మానేపల్లి జ్యువెల్లర్స్ అధినేత మానేపల్లి రామారావు. వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదగడమే కాకుండా ఆధ్యాత్మిక రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆయన నిర్మించిన స్వర్ణగిరి వేంకటేశ్వర దేవాలయం అందుకు నిదర్శనం. ఆ ఆలయ విశేషాలు, మానేపల్లి రామారావు విజయగాథ మీ కోసం.
జ్యువెలరీ బిజినెస్ లో మానేపల్లి జ్యువెలర్స్ ది ప్రత్యేక స్థానం..! నాణ్యత అనే పునాదిపై తరతరాలుగా నమ్మకంగా నడుస్తున్న సంస్థ అది..! ఈ విజయం వెనుక ఎన్నో ఏళ్ల కష్టం దాగుంది. మానేపల్లి గ్రూప్ నకు ప్రస్తుతం మానేపల్లి రామారావు ఛైర్మన్ గా కొనసాగుతున్నారు. ఆయన నేతృత్వంలో, గైడెన్స్ లో సంస్థ విజయవంతంగా ముందుకు సాగుతోంది. సికింద్రాబాద్ జనరల్ బజార్ లో చిన్న షాపుగా మొదలైన ప్రస్థానం నేడు జంటనగరాల్లో 6 పెద్ద పెద్ద షోరూమ్ ల వరకు విస్తరించడం విశేషం.
వారసత్వంగా వచ్చిన జ్యువెలరీ వ్యాపారమే కాకుండా మానేపల్లి రామారావు గతంలో బ్యాంకు ఉద్యోగిగా పని చేశారు. ఐరన్, స్టీల్ బిజినెస్ లోనూ రాణించారు. తిరిగి బంగారం వ్యాపారాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఎంత ఎత్తు ఎదిగినా కూడా ఒదిగి ఉండాలని.. మనిషి స్వార్థంతో ఉండకూడదని ఆయన చెప్తారు. వీలైనంత వరకు ఇతరులకు సహాయం చేయడమే పరమావధిగా భావిస్తారు. దీనితో పాటు మానేపల్లి రామారావుకు ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువే. అందుకే యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి సమీపంలో మానేపల్లి హిల్స్ పై స్వర్ణగిరి పద్మావతి, గోదాదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించారు. ఇల వైకుంఠం తిరుమలను తలపించే ఆలయం ఎన్నో విశేషాలతో కొలువుదీరింది.
22 ఎకరాల విశాల ప్రాంగణంలో స్థపతి డీవీఎన్ ప్రసాద్ చేతుల మీదుగా స్వర్ణగిరి దేవాలయం రూపుదిద్దుకుంది. పాంచరాత్ర ఆగమాన్ని అనుసరించి.. ప్రాచీన శిల్ప శాస్త్ర రీతుల ఆధారంగా ఇది ఏర్పాటైంది. యాదాద్రి తిరుమల దేవస్థానంగా కూడా దీన్ని పిలుస్తారు. పల్లవ, విజయ నగర, చోళ, చాళుక్య శిల్ప రీతులతో ఆలయం చూడగానే ఆకట్టుకుంటుంది. ప్రాకారానికి నాలుగు వైపులా నాలుగు రాజగోపురాలు, సువిశాలమైన మండపాలు, 5 అంతస్థుల విమానగోపురంతో కూడిన గర్భాలయం చూడగానే భక్తిభావం ఉప్పొంగుతుంది. సుమారు 12 అడుగుల ఎత్తైన వేంకటేశ్వరుని విగ్రహం.. తిరుమల శ్రీవారి ఆలయాన్ని ప్రతిబింబిస్తుంది. పద్మావతి దేవి, గోదా దేవి, మదన గోపాల కృష్ణ స్వామి, గరుడాల్వార్ తదితర ఉపాలయాలు కూడా ఇక్కడ కొలువుదీరాయి.
భక్తులు తమ విన్నపాలు తెలియజేసేందుకు మనోభీష్ట ఫలకం, స్వామి వారికి ఊరేగించేందుకు 40 అడుగుల భారీ రథం, విశాలమైన పుష్కరిణి, నాలుగు వేదాలకు ప్రతీకలైన వేద మూర్తుల విగ్రహాలు.. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతల సమాహారం ఈ ఆలయం. మార్చి 1 నుంచి 6వ తేదీ వరకు స్వర్ణగిరిలో మహాకుంభాభిషేక మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. 6న శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట, ఆలయ ప్రారంభోత్సవం జరుగనుంది.
రాబోయే రోజుల్లో ఇదొక ఆధ్మాత్మిక దివ్య క్షేత్రంగా వెలుగొందనుంది. భక్తుల కోర్కెలు తీర్చే పుణ్య ప్రదేశంగా విరాజిల్లనుంది. ఆధ్మాత్మిక పరిమళాన్ని వెదజల్లే ఇలాంటి ఆలయాన్ని నిర్మించిన మానేపల్లి రామారావుకు వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని.. భవిష్యత్ లో మరెన్నో మంచి కార్యక్రమాలు చేసే శక్తిని ప్రసాదించాలని కోరుకుందాం.
- పి. వంశీకృష్ణ