అభ్యంతరకర, అశ్లీల కంటెంట్ ప్రసారం చేస్తున్న ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. అలాంటి 18 ఓటీటీలను బ్యాన్ చేసింది. వాటితో అనుసంధానమైన 57 సోషల్ మీడియా అకౌంట్లు, 19 వెబ్ సైట్లు, 10 యాప్స్ పై కూడా నిషేధం విధించింది. వాటిని పబ్లిక్ యాక్సెస్ నుంచి డిసేబుల్ చేసింది. అశ్లీల కంటెంట్ ను వెంటనే తొలగించాలని, పద్ధతి మార్చుకోవాలని ఆయా ఓటీటీలను కేంద్రం చాలాసార్లు హెచ్చరించింది. అయినప్పటికీ తీరు మారలేదు. దీంతో, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వాటిపై వేటు వేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
ఆయా ఓటీటీల్లో టెలికాస్ట్ చేస్తున్న కంటెంట్ లో ఎక్కువ భాగం అభ్యంతరకరంగా ఉందని కేంద్రం గుర్తించింది. మహిళలను కించపరిచేలా చిత్రీకరించిన చాలా సినిమాలు కూడా వాటిలో ఉన్నాయి. సమాజంలో సత్సంబంధాలను అవి దెబ్బతీసేలా ఉన్నాయి. కొన్ని కోట్ల మంది ఆ ఓటీటీలను, యాప్స్ ను వాడుతున్నారు. కాగా సర్కారు నిర్ణయంతో భారత్ లో అవన్నీ నిలిచిపోయాయి.
ఏయే ఓటీటీలు బ్యాన్ అయ్యాయంటే?
- డ్రీమ్స్ ఫిల్మ్స్
- వూవి
- యెస్మా
- అన్ కట్ అడ్డా
- ట్రై ఫ్లిక్స్
- ఎక్స్ ప్రైమ్
- నియాన్ ఎక్స్ వీఐపీ
- బేషరమ్స్
- హంటర్స్
- రాబిట్
- ఎక్స్ ట్రా మూడ్
- న్యూ ఫ్లిక్స్
- మూడ్ ఎక్స్
- మోజ్ ఫ్లిక్స్
- హాట్ షాట్స్ వీఐపీ
- ఫ్యూగి
- చికూఫ్లిక్స్
- ప్రైమ్ ప్లే
కాగా, భారత్ లో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. అందులో భాగంగానే వెబ్ సిరీస్ కు ఓటీటీ అవార్డ్స్ ఇస్తున్నట్టు తెలిపింది. అయితే నిబంధనలను అతిక్రమించే ఓటీటీలపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది.
- పి. వంశీకృష్ణ