ఒకటి.. రెండు.. మూడు..! ఇలా చెప్తుంటే ఏదైనా ఎంట్రన్స్ లో కార్పొరేట్ విద్యా సంస్థల స్టూడెంట్స్ సాధించిన ర్యాంకులు అనుకుంటున్నారా? అస్సలు కాదు. మరేంటీ అంటారా? ఉస్మానియా యూనివర్సిటీలో నైట్ వాచ్ మెన్ గా పనిచేసే ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి సాధించిన ప్రభుత్వ ఉద్యోగాలు..! అవును మీరు చదివేది నిజమే..! తెలంగాణ గురుకుల బోర్డు ప్రకటించిన ఫలితాల్లో ప్రవీణ్ మూడు జాబ్స్ కు ఎంపికవడం విశేషం.
ఇదీ ప్రవీణ్ నేపథ్యం:
ప్రవీణ్ స్వస్థలం మంచిర్యాల జిల్లా పొన్కల్. ఆయన తండ్రి మేస్త్రీ, తల్లి బీడీ కార్మికురాలు. ప్రవీణ్ డిగ్రీ వరకు జెన్నారంలో చదివారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో బీఈడీ, ఎంకాం, ఎంఈడీ పూర్తి చేశారు. తల్లిదండ్రులు చాలా కష్టపడి ప్రవీణ్ ను ఉన్నత చదువులు చదివించారు. దీంతో, మంచి ఉద్యోగం సాధించాలని.. జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని ఆయన కలలు కన్నారు. కానీ పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకునేందుకు పేదరికం అడ్డొచ్చింది. దీంతో, ఉస్మానియా యూనివర్సిటీలోని ఎడ్యుకేషనల్ మల్టీమీడియా రీసెర్చ్ సెంటర్ లో నైట్ వాచ్ మెన్ గా చేరారు. అక్కడే స్ట్రీట్ లైట్ల కింద ప్రిపరేషన్ కొనసాగించారు.
అర మార్కుతో దక్కని ఉద్యోగం:
2018 డీఎస్సీ సమయంలో అర మార్కు తేడాతో ప్రవీణ్ కు ఉద్యోగం దక్కలేదు. అయినప్పటికీ ఆయన నిరాశ చెందలేదు. పట్టుదలతో చదివారు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా, యూ ట్యూబ్ లో దొరికే కంటెంట్ తో సొంతంగా ప్రిపేర్ అయ్యారు. చివరకు ఆయన కృషి ఫలించింది. విజయం వరించింది. గురుకుల ఫలితాల్లో ప్రవీణ్ సత్తా చాటారు. బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ సొసైటీలో కామర్స్ విభాగంలో జూనియర్ లెక్చరర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు ఎంపికయ్యారు.
ప్రవీణ్ కు అభినందనల వెల్లువ:
పది రోజుల వ్యవధిలో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ప్రవీణ్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఎడ్యుకేషనల్ మల్టీమీడియా రీసెర్చ్ సెంటర్ అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియాలోనూ ఆయనకు విషెస్ కొనసాగుతున్నాయి. ఈ రోజుల్లో చిన్న చిన్న పరాజయాలకే నిరాశకులోనై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఎంతో మంది యువతకు ప్రవీణ్ విజయగాథ నిజంగా ఆదర్శం.
- పి. వంశీకృష్ణ