Summer In Hyderabad

వింట‌ర్ సీజ‌న్ ఇంకా అయిపోలేదు..! స‌మ్మ‌ర్ రానేలేదు..! కానీ ఎండ‌లు మాత్రం దంచికొడుతున్నాయి. అప్పుడే వేస‌విని త‌ల‌పిస్తూ బెంబేలెత్తిస్తున్నాయి. భానుడి భ‌గ‌భ‌గ‌లు జ‌నాల‌ను భ‌య‌పెడుతున్నాయి. తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ తో పాటు చాలా చోట్ల ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

సాధార‌ణంగా న‌వంబ‌ర్ నుంచి ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు చ‌లికాలం ఉంటుంది. ఫిబ్ర‌వ‌రి చివ‌రి నుంచి టెంప‌రేచ‌ర్ క్ర‌మంగా పెరుగుతుంది. శివ‌రాత్రికి శివ శివా అనుకుంటూ చ‌లి వెళ్లిపోతుంద‌ని పెద్ద‌లు చెప్తూ ఉంటారు. అంటే అప్ప‌టి వ‌ర‌కు ఉన్న చ‌ల్లని వాతావ‌ర‌ణం మెల్ల‌గా మాయ‌మై.. ఉక్క‌పోత షురూ అవుతుందన్న మాట‌. మార్చి, ఏప్రిల్, మే నెల‌ల్లో సూర్యుడిక త‌న ప్ర‌తాపాన్ని చూపిస్తాడు. కానీ ఈ సారి సీన్ కాస్త రివ‌ర్స్ అయింది. ఫిబ్ర‌వ‌రిలోనే భానుడు బ్యాటింగ్ మొద‌లుపెట్టాడు. జ‌నాల‌కు ఇప్ప‌టి నుంచే చుక్క‌లు చూపిస్తున్నాడు.

అప్పుడే 36 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్ర‌త‌లు:

హైద‌రాబాద్ తో పాటు చాలా చోట్ల ప‌గ‌టి పూట ఉష్ణోగ్ర‌త‌లు అమాంతం పెరిగాయి. రాజ‌ధాని న‌గ‌రంలో 36 డిగ్రీల‌కు పైగా గ‌రిష్ట ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయి. ఇక‌, ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో సాధార‌ణంగా దాదాపు 31 డిగ్రీ టెంప‌రేచ‌ర్ ఉటుంది. కానీ అది రికార్డు స్థాయిలో 4.5 డిగ్రీలు పెరిగింది. ఖ‌మ్మంలోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. నిజామాబాద్ లో 2.8, మెద‌క్ లో 2.2, రామ‌గుండంలో 2.1, భ‌ద్రాచ‌లంలో 1.5 డిగ్రీల చొప్పున సాధార‌ణం కంటే ఎక్కువ టెంప‌రేచ‌ర్ పెరిగింది.

Poultary

రాత్రిపూట కూడా అదే ప‌రిస్థితి:

ఉష్ణోగ్ర‌తలు ప‌గ‌లే కాదు రాత్రి కూడా అలాగే పెరిగాయి. హైద‌రాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, రామ‌గుండం త‌దిత‌ర ప్రాంతాల్లో సాధార‌ణం క‌న్నా 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్ర‌త‌లు రికార్డ‌య్యాయి. ఇత‌ర ప్రాంతాల్లోనూ ఉక్క‌పోత పెరిగింది. ఈ అధిక ఉష్ణోగ్ర‌త‌ల‌తో జ‌నం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మండే ఎండ‌ల‌కు కొన్ని చోట్ల వేడి గాలులు కూడా తోడ‌వుతున్నాయి. ఫ్యాన్లు తిరుగుతున్నా కూడా ఉక్క‌పోత త‌గ్గ‌డం లేదు.

ఎండా కాలం రాక‌ముందే టెంప‌రేచ‌ర్ ఈ రేంజ్ లో ఉంటే స‌మ్మ‌ర్ వ‌స్తే ప‌రిస్థితి ఇంకెలా ఉంటుందో అని జ‌నం కంగారు ప‌డుతున్నారు. సూర్యుడు ఇకెంత ప్ర‌తాపం చూపిస్తాడోన‌ని జంకుతున్నారు. పెరిగే ఉష్ణోగ్ర‌త‌ల నుంచి కాపాడుకునేందుకు ఇప్ప‌టి నుంచే ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను వెతుక్కుంటున్నారు.

- పి. వంశీకృష్ణ‌
Bharati Cement