ఊహించిందే జరిగింది. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ఓపెన్ హైమర్.. 96వ ఆస్కార్ అవార్డుల్లో సత్తా చాటింది. క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మొత్తం 13 విభాగాల్లో పోటీపడగా ఏడు అవార్డులను కొల్లగొట్టింది. ఓపెన్ హైమర్ కోసం క్రిస్టోఫర్ దాదాపు మూడేళ్లు కష్టపడ్డారు. 2020లో టెనెట్ తర్వాత తన దృష్టంతా దీనిపైనే పెట్టారు. ప్రతీ సీన్ ను అద్భుతంగా తీసి విజువల్ వండర్ ను క్రియేట్ చేశారు. అణుబాంబును కనిపెట్టిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త రాబర్ట్ ఓపెన్హైమర్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా. ఆ సమయంలో ఓపెన్ హైమర్ ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ, ఒత్తిడిని ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్టు చూపించారు దర్శకుడు క్రిస్టోఫర్.
ఓపెన్ హైమర్ కు ఏయే కేటగిరీల్లో ఆస్కార్ దక్కిందంటే..:
- ఉత్తమ చిత్రం
- బెస్ట్ డైరెక్టర్
- బెస్ట్ యాక్టర్
- బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్
- బెస్ట్ ఒరిజినల్ స్కోర్
- బెస్ట్ సినిమాటోగ్రఫీ
- బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్
బెస్ట్ మూవీ కేటగిరిలో ఓపెన్ హైమర్ తో పాటు బార్బీ, అమెరికన్ ఫిక్షన్, కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ చిత్రాలు పోటీ పడ్డాయి. మిగతా వాటిని వెనక్కి నెట్టి ఓపెన్ హైమర్.. ఆస్కార్ ను కైవసం చేసుకుంది.
లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్లో పురస్కార వేడుకలు అట్టహాసంగా జరిగాయి. అమెరికన్ టెలివిజన్ హోస్ట్, హాస్యనటుడు, నిర్మాత జిమ్మీ కిమ్మెల్ దీనికి హోస్ట్ గా వ్యవహరించారు. దేశ, విదేశాల నుంచి ఎంతో మంది సినీ తారలు ఈ ప్రోగ్రాంకు అటెండ్ అయ్యారు. ఇక, యోర్గోస్ లాంటిమోస్ డైరెక్ట్ చేసిన పూర్ థింగ్స్ కు నాలుగు అవార్డులు దక్కాయి. ఉత్తమ నటి, బెస్ట్ క్యాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ కేటగిరీల్లో పురస్కారాలు సొంతం చేసుకుంది.
ఆస్కార్ పూర్తి వివరాలు..:
- ఉత్తమ చిత్రం – ఓపెన్ హైమర్
- ఉత్తమ నటుడు – కిలియన్ మర్ఫీ (ఓపెన్ హైమర్)
- ఉత్తమ నటి – ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్)
- ఉత్తమ దర్శకుడు – క్రిస్టోఫర్ నోలన్ (ఓపెన్ హైమర్)
- బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – రాబర్ట్ డౌనీ జూనియర్ (ఓపెన్ హైమర్)
- బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రస్ – డివైన్ జాయ్ రాండాల్ఫ్ (ది హోల్డోవర్స్)
- ఉత్తమ హెయిర్ స్టయిల్ అండ్ మేకప్ – నడియా స్టేసీ, మార్క్ కౌలియర్ (పూర్ థింగ్స్)
- బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ – ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
- బెస్ట్ సినిమాటోగ్రాఫర్ – హెయటే వన్ హోయటేమా (ఓపెన్ హైమర్)
- బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ – గాడ్జిల్లా మైనస్ వన్
- బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ – ఓపెన్ హైమర్ (జెన్నిఫర్ లేమ్)
- బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ – ద లాస్ట్ రిపేర్ షాప్ (బెన్ ఫ్రౌడ్పుట్, క్రిస్ బ్రోవర్స్)
పి. వంశీకృష్ణ